శ్రీ శ్రీ – సంస్కృత భాషా వినియోగం

2:56 AM Edit This 0 Comments »
శ్రీ శ్రీ ప్రగతి వాదిగా ఎంత ఆవేశంగలవాడో ప్రయోగవాదిగా కూడా అంత అభినివేశం గలవాడు. ఆ ప్రయోగవాదానికి కేంద్రస్థానం “శబ్ధం”. శబ్దాల నడక, అనంత కోణాల్లోని వైచిత్రి – ఆయన మౌలిక ప్రేరణల్లో ఒకటి. అధివాస్తవికత మీద ఆయన కున్న యిష్టం. 1930 లలో ప్రపంచం మొత్తం మీద వ్యాపించిన ప్రయోగవాద ప్రభావమే. గురజాడ శ్రీ శ్రీ కి ఆరాధ్యుడేకాని, కొద్ది కవితల్లొ తప్ప ఆయన మార్గాన్ని శ్రీ శ్రీ అనుసరించ లేదు.




“వాడు” కవితలో

“అందరం కలిసి చేసిన ఈ

అందమైన వస్తు సముదాయం అంతా

ఎక్కడో ఒక్కడే వచ్చి

ఎత్తుకు పోతూంటే చూచి

అన్యాయం, అన్యాయం అని మేమంటే

అనుభవించాలి మీ కర్మం అంటాడు”



అలాగే, భిక్షువర్గీయసి, బాటసారి, సంధ్యా సమస్యలు మొదలైన కవితల్లొ కూడా తెలుగు భాషకీ, సంభాషణ శైలికీ, కాకువుకీ, ప్రాధాన్యమిస్తూ రాశాడు. అయితే, శ్రీ శ్రీ చాలా కవితలు సంస్కృత పద బాహుళ్యం మీద ఎందుకు ఆధారపడి ఉంటై అన్నది ప్రశ్న. ఎందుకంటే, ఆయన వేగవంతమైన ఆవేశపూరితమైన శైలికావాలి. అది సంస్కృత శబ్దాలతో, సమాసాలతో, సాధ్యమౌతుంది. అందుకే అంత సంస్కృతం శ్రీ శ్రీ కి యిష్టమైంది. నడకలోని ఆవేశం కోసం, తీవ్రమైన నడక కోసం, అది ప్రాచీన మా నవీనమా అన్న ప్రశ్న లేకుండా, తన శైలికోసం స్వీకరిస్తాడు శ్రీ శ్రీ…



“దారుణ మారణ దానవభాషలు

ఫేరవ భైరవ భీకర ఘోషలు”

“ఖండ పరుశుగళ కపాలగణముల్”

“వలయ విచల ద్విహంగాలో

విలయ సాగరతరంగాలో

యుద్ధ గుంజన్మృరంగాలో”

“గిరులు సాగరులు

కంకేళీకామంజరులు

ఝురులు నా సొదరులు”



శబ్ద స్వరూపాన్ని కూడా నడకల కోసం మార్చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నై. గిరులు, సాగరాలు, గుంజరులు, ఝరులు అనవలసింది, “సాగరులు” అనేస్తాడు. సగరుని పుత్రులు సాగరులౌతారు. సంస్కృత భాషలో ప్రాసలు, అనుప్రాసలు, శబ్దాలంకార విస్తృతి బాగా ఎక్కువ. అందుకే తన ప్రయోగశీలతకు ఆ భాష ఎక్కువగా ఆకర్షించింది. ఆ భాషలో శబ్ద చమకృతులు ఎన్నైనా చెయ్యవచ్చు. ఆయనే అన్నట్ళు ఒక్కొక్క చోట అర్ధానికి కూడా విడాకులివ్వడం సర్రియలిస్టు లక్షణమే.



“భ్రమరగీత”లో ఇలా అంటాడు.



“గిరగిర గిరాం

భ్రమరం

గిరాం భ్రమరం

భ్రమం

భ్రమరణం

భ్రమరభ్రమణం

భ్రమణ భ్రమరం

గిరగిరగిరా గిరా గిరాం భ్రమణం….!



తుమ్మెద మోతపెడుతూ తిరుగుతున్నట్లే ఉంది ఈ నడక. ఈ వైచిత్రికి తెలుగు భాషలో కుదరదు.

శ్రీ శ్రీది ఆవేశ ప్రకృతి. నడక కోసం అనేక ఔచిత్యాన్ని అధిగమించడం కూడా కనిపిస్తుంది. అయితే, అవి శ్రీ శ్రీ లాంటి తన యుగకర్త చెయ్యడం వల్ల, మంచివిగానే ప్రచవితం కావడం అతని శక్తికి సంబంధించిన అంశం. అసలు “మహా ప్రస్థానం” అనే దానికే “మరణం” అని అర్ధమైనా, సుదీర్ఘ ప్రయాణం, లాంగ్ మార్చ్ అనే అర్ధంలో రూఢమైంది. అలాగే “పతితులార! భ్రష్టులార!” అనే శబ్దాల రూఢ్యర్ధం వేరు. శ్రీ శ్రీ ప్రయోగించిన అర్ధం వేరు. అయిన శ్రీ శ్రీ నుండి అవి అర్ధాలు మార్చుకున్నై. గురజాడ “మాటామంతీ, అవీ ఇవీ” అనే సంకలనంలో ఇలా అన్నాడు.

విషాద రేఖవృతమైన మనః ప్రవృత్తిపై, కరుణ రస శబలితమగు ప్రభావము ఎటులుండును? ప్రాచీన స్మృతులను ఉయ్యాలలూపినట్లు ఊపి మనసును అనునయించి మార్ధవమును కలిగించును. ఈ వాక్యం ప్రభావమే శ్రీ శ్రీ లో



“శిశువు చిత్రనిద్రలో

ప్రాచీన స్మృతులూ చే చప్పుడూ”



అయింది. శిశువుకి ప్రాచీన స్మృతులంటే, పూర్వజన్మ స్మృతులే ఔతుంది. కాని, శ్రీ శ్రీకిశబ్దము , శబ్దం నడక మాత్రమే ముఖ్యం.



“ఖడ్గ మ్నగోదగ్రవిరామం

ఝంఝానిల షడ్జధ్వానం”



అన్నప్పుడు “షడ్జ” స్వరం నెమలి క్రేంకారానికే అన్వయిస్తుంది. కాని ఆపదంలోని బలంవల్ల ఝంఝా మారుతానికి ప్రయోగించి, ఆహా అనిపిస్తాడు శ్రీ శ్రీ. ఆవేశాన్ని చెప్పడానికి అనేక ప్రతీకల్ని అధ్బుతంగా “నవ కవిత” లో రాసిన శ్రీ శ్రీ శైలిలో కలిసిపోయేటట్టుగా”పులిచంపిన లేడీ నెత్తురు” అంటాడు. “పులి చంపిన లేడి” దయనీయమైన దృశ్యమేగాని, ఆవేశ ఔచిత్యం గలదికాదు. అయినా మనం ఆ శైలిలో పడీ కొట్టుకుపోతాం. ఇలాంటివి ఎన్నో ఉంటై శ్రీ శ్రీ లో. “హరోంహరహర” అని దూకడంలో శబ్దపూర్వకమైన ఆవేశం, యింకెలా అన్నారాదు కాబట్టి అలాగే ప్రయోగించాడు. శబ్దాన్ని తాను కోరినట్లు నడిపించి, ఏదో ఒక కోణంలో అంగీకరింపజేస్తేనే, ఇలాటి వాటిని కూడా తనలో కలుపుకోగలడు పాఠకుడు.

పైన చెప్పినదంతా ఒక పార్శ్వం. రెండో పార్శ్వంలో శ్రీ శ్రీ సంస్కృత శబ్ద ప్రయోగం లోని భావధ్వనిని కూడా వివరించవలసి ఉంది. శ్రీ శ్రీ ప్రాచీన సాహిత్యాన్నీ, అలంకార శాస్త్రాన్నీ బాగా చదివిన కవి. అలాగే పాశ్చాత్య కవిత్వంలోని మర్మాలన్నీ అవగతం చేసుకున్న కవి. అందుకే శబ్దానికి, భావాన్ని స్ఫురింపజేసే శక్తిలోని లోతుల్ని కూడా బాగా అవగహన చేసుకుని, తన కవిత్వంలో వాటిని ప్రతిబింబజేసిన సమర్ధుడు.

ఆవేశం, సౌందర్యం, విషాదం, భీభత్సం ఇలా ఎన్ని భావాలనైనా, సంస్కృత పదాలనడక ద్వారా, ప్రాసాను ప్రాసాది సామాగ్రి ద్వారా పలికించే శిల్పపటిమ శ్రీ శ్రీకి విస్తృత ప్రాచీన, పాశ్చాత్య సాహిత్య అధ్యయనం వల్ల వచ్చిందే.

“గంటలు” కవితలో గంట అటూ ఇటూ గంట మోగినట్లున్న లయను గమనించవచ్చు.



“భయంకరముగా, పరిహాసముగా

ఉద్రేకముతో, ఉల్లాసముగా

సక్రోధముగా, జాలిజాలిగా

అనురాగముతో, ఆర్భాటముగా

ఒకమారిచటా, ఒక మారిచటా

గంటలు! గంటలు

గంటలు! గంటలు”



ఆవేశాన్ని పలికించడానికీ, సౌందర్యాన్ని ధ్వనింపజెయ్యడానికీ రెండు ఉదాహరణలు చూడవచ్చు.



“కష్టజీవులకు, కర్మ వీరులకు

నిత్యమంగళం నిర్ధేశిస్తూ

స్వస్తి వాక్యములు సంధానిస్తూ

స్వర్గ వాద్యములు సంధావిస్తూ

వ్యధార్త జీవిత యధార్ధ దృశ్యం

పునాదిగా ఇకజనించబోయే

భావి వేదముల జీవనదములు

జగత్తు కంతా చవులిస్తానోయ్!”



“కవితా! ఓ కవితా! నా యువ కాశలనవపేశల

సుమగీతావరణంలో, అతి సుందర సుస్యందన మందున..”



టి.యస్. ఇలియట్, Allusivness అనే అభివ్యక్తిని ఒక శిల్ప ధోరణిగా ప్రచరితం చేశాడు. ప్రాచీన పురాణ సన్నివేశాన్ని స్ఫురింపజేసే, పదాన్ని ప్రయోగించి, అ వాతావరణాన్ని గుర్తుచేస్తూ, ఆధునిక నేపధ్యానికి అన్వయించడమే ఈ శిల్పం. ఈ కింది ఉదాహరణ దీనికి సంబంధించినదే.



“ప్రపంచమొక పద్మవ్యూహం

కవిత్వమొక తీరని దాహం”



పద్మవ్యూహం – మహాభారతంలోని ప్రసిద్ధమైన యుద్ధ వ్యూహం. అది శత్రువైన దుర్యోధనుని చేత పన్నబడింది. అభిమన్యుడు అందులో ప్రవేశించి, ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నాడు. ఇది గుర్తు రాగానే, వర్తమాన కాలం అంతటి సమస్యామయ మైందనే స్ఫురణ కలుగుతుంది. ఈనాటి కవిత్వం, వర్గశత్రువు పన్నిన సామాజిక వ్యూహాలతో నిండి ఉందనీ, కవిత్వం వాటిని ప్రతి ఫలించాలనీ కవి ఉద్దేశించిన భావ ధ్వని.

కొన్ని చోట్ల సంస్కృత పదాల శక్తిని, పరాకాష్ట దశలో చెదిరి పోయిన భావాల్ని స్ఫురించేటట్లు వాడడం శ్రీశ్రీలో కనిపిస్తుంది. ఇది బీభత్సాన్ని బాగా వ్యక్తం చేస్తుంది.



“హింసన చణ ధ్వంస రచన

ధ్వంసన చణ హింస రచన”



ఇంక ఎన్నో విధాలుగా శ్రీ శ్రీ సంస్కృత భాషని వినియోగించుకున్నాడు. ప్రాచీన నేపధ్యంలోని పదాల్ని తీసుకున్నా, సంప్రదాయ సిద్ధమైన భావాల్ని తీసుకున్నా, వాటికి వర్తమాన స్పర్శ నిచ్చాడు. అతని సంస్కృత పద ప్రయోగంలో నవ్యత ఉంది, ఆధునికతా ధ్వని ఉంది. ఇది శ్రీ శ్రీ నాటికి ఒక వినూత్నఉపలబ్ధి. పదాన్ని ప్రాణంగా చేసుకొని, అర్ధానికి ఆకారమిచ్చిన శ్రీ శ్రీ అభ్యుదయ యుగ ప్రారంభకుడైనాడు.

శ్రీ శ్రీ పరిమళం

2:26 AM Edit This 0 Comments »
ఆవేశం ఆయన సిరా ...


ఆయన కవితలు అక్షర చైతన్యాలు ....

పతితులార భ్రష్టులార , బాధా సర్ప దష్టులార ....అంటూ కవిత్వాన్ని వెన్నెల వాకిళ్ళ లోంచి శ్రామికుడి చెమట చుక్కల్లోకి ఈడ్చుకు వచ్చిన ప్రజాకవి .ఆ మానవీయుని శత జయంతి సందర్భంగా...."సిప్రాలి " నుండి .....



సిరిసిరిమువ్వలు



పాతబడి కుళ్లిపోయిన

నీతులనే పట్టుకుని మనీషుల మంటూ

నూతన జీవిత లహరికి

సేతువు నిర్మింతురేల ?సిరిసిరి మువ్వా !



నీత్యవినీతులలో గల

వ్యత్యాసము తెలిసినట్టి వాడెవ్వడు ?నా

కత్యవసరమొకటే , ఔ

చిత్యం వర్తమునందు, సిరిసిరి మువ్వా !



ప్రాస క్రీడలు



ఈ మంత్రుల హయాం లోన

రామ రాజ్యమెప్పుడు ?

పడమటి దిక్కున సూర్యుడు

పొడుచుకొచ్చినపుడు



ప్రజాస్వామ్య పార్టీల్లో

ప్రజలకు తావెప్పుడు ?

నేటి బీరకాయలోన

నేయి పుట్టినప్పుడు



లిమ ఋక్కులు



నేను

ముసలివాణ్ణి

కాను అసలు వాణ్ణి

పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి

పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి

అందుకున్న ఆకాశపు కొసల వాణ్ణి



ఔను

నిజంగా నేను

ప్రజల కవినేను

ఎంచే తంటేను

వాళ్ళని చదివేను

చదివిందే రాసేను



కదన విహారానికి కత్తి పట్టు

కార్మిక వీరుడవై సుత్తి తిప్పు

ప్రగతి విరోధుల భిత్తి కొట్టు

సామ్య వాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు

సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు



సామ్య వాదం

ఈనాటి వేదం

అందరిలో మారుమోగే నినాదం

అందరికీ అందిస్తుంది మోదం

అది సఫలం సుఫలం శ్రీదం