ముళ్ళపూడి వెంకటరమణ

10:43 PM Edit This 0 Comments »
నాకు చాల ఇష్టమైన సాహితివేత్త ముళ్ళపూడి వెంకటరమణ. భావి తరాల వారికి అతని సేవల గురించి తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను ఈ మహా వ్యక్తి పరిచియం ఎప్పుడు చేస్తున్న. ముళ్ళపూడి వెంకటరమణ గారు 1931 జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించాడు. ఇతని అసలుపేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురం కు చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.

1945లో "బాల" పత్రికలో రమణ మొదటి కథ "అమ్మ మాట వినకపోతే" అచ్చయ్యింది. అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయభాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయాడు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నాడు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్ధిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరాడు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశాడు

ఆయన ఫిబ్రవరి  23, 2011 న మరణించారు.


రచనలు

దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పవచ్చును.


హాస్య నవలలు, కథలు

ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని

  1. బుడుగు - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
  2. ఋణానందలహరి (అప్పుల అప్పారావు - అప్పుల ప్రహసనం
  3. విక్రమార్కుని మార్కు సింహాసనం - సినీ మాయాలోక చిత్ర విచిత్రం
  4. గిరీశం లెక్చర్లు - సినిమాలపై సెటైర్లు
  5. రాజకీయ బేతాళ పంచవింశతి - రాజకీయ చదరంగం గురించి
  6. ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం -

అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కధలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి

1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవిశతి, ఇతర కథలు
2. కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
3. బాల రమణీయం  : బుడుగు
4. కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు
5. కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు
6. సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు
7. సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు
8. అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
9. ప్రస్తుతం' కోతికొమ్మచ్చి' పేరుతొ తన జీవిత చరిత్ర లాంటిది స్వాతి వార పత్రికలొ వ్రాస్తున్నారు.

ఇంకా

  1. ఇద్దరు మిత్రులు (వెండితెర నవల)
  2. తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు
  3. రమణీయ భాగవత కథలు
  4. రామాయణం (ముళ్ళపూడి, బాపు)
  5. శ్రీకృష్ణ లీలలు

సినిమా కథ, మాటలు

  1. సాక్షి
  2. పంచదార చిలక
  3. ముత్యాల ముగ్గు
  4. గోరంత దీపం
  5. మనవూరి పాండవులు
  6. రాజాధిరాజు
  7. పెళ్ళి పుస్తకం
  8. మిష్టర్ పెళ్ళాం
  9. రాధాగోపాలం

మూలాలు, వనరులు

బుడుగు పుస్తకం ముందుమాట "బుడుగు వెంకటరమణ ..." లో సంపాదకుడు ఎమ్బీయస్ ప్రసాద్ - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2001-2007 ఆరు ముద్రణలు).

గో హత్యలు ఆపాలి !!!

10:33 PM Edit This 0 Comments »
గోవు తిరుగాడు మన ముంగిళ్ళు,
దేవాలయాలను తలపించు గుళ్ళు
గోవులు కదలాడే దేవుళ్ళు...


భూమాతకు ఆభరణం గోమాత,
తరతరాల భారతీయ భూతదయ పరంపరకు సజీవ సాక్ష్యం గోమాత
గోసేవ ఇచ్చును కోటి యజ్ఞ యాగాదుల పుణ్య ఫలం
గోసంపద ఉన్నచో అది అర్ధ బలం,
గోమూత్రం పుణ్య జలం.
గోక్షీరం పసిపాపలకు తల్లి పాల బలం.
గోవును పూజించిన చాలు నశించును మన పాపాలు సకలం.

ఆవు తానూ స్వీకరించే ఆహార పదార్ధాల లోని విష తుల్యాలని తన కొవ్వులో నిలువ ఉంచుకుని ఔషధ గుణాలున్న ఆహారాలను పంచతము ,పేడల ద్వార విసర్జిస్తుంది.గో హత్య గో మాంస భక్షణ నిషేధమని చెప్పినది,పంచ గవ్యాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయని చెప్ప డము అందుకే..గో పంచతము కాన్సెర్ నివారకం గ పనిచేస్తుందని ఈ మధ్యే నిరుపితమై నది .అమెరికా లో ఈ పంచతం కొరకు పేటెంట్ కు ప్రయత్నిస్తున్నారు. గోపాలుడు పుట్టిన భరతదేశం లో గోవులకు రక్షన లేకుండా పోయింది. గో హత్యలు పెరిగిపోతున్నాయి. గోహత్యలు నిషేదించాలి. గోహత్యలు చేసిన వారికి కఠిన శిక్షలు వేయాలి. దీనికోసం చట్టం తెచ్చేవరకు మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి.

శ్రీ శ్రీ – సంస్కృత భాషా వినియోగం

2:56 AM Edit This 0 Comments »
శ్రీ శ్రీ ప్రగతి వాదిగా ఎంత ఆవేశంగలవాడో ప్రయోగవాదిగా కూడా అంత అభినివేశం గలవాడు. ఆ ప్రయోగవాదానికి కేంద్రస్థానం “శబ్ధం”. శబ్దాల నడక, అనంత కోణాల్లోని వైచిత్రి – ఆయన మౌలిక ప్రేరణల్లో ఒకటి. అధివాస్తవికత మీద ఆయన కున్న యిష్టం. 1930 లలో ప్రపంచం మొత్తం మీద వ్యాపించిన ప్రయోగవాద ప్రభావమే. గురజాడ శ్రీ శ్రీ కి ఆరాధ్యుడేకాని, కొద్ది కవితల్లొ తప్ప ఆయన మార్గాన్ని శ్రీ శ్రీ అనుసరించ లేదు.




“వాడు” కవితలో

“అందరం కలిసి చేసిన ఈ

అందమైన వస్తు సముదాయం అంతా

ఎక్కడో ఒక్కడే వచ్చి

ఎత్తుకు పోతూంటే చూచి

అన్యాయం, అన్యాయం అని మేమంటే

అనుభవించాలి మీ కర్మం అంటాడు”



అలాగే, భిక్షువర్గీయసి, బాటసారి, సంధ్యా సమస్యలు మొదలైన కవితల్లొ కూడా తెలుగు భాషకీ, సంభాషణ శైలికీ, కాకువుకీ, ప్రాధాన్యమిస్తూ రాశాడు. అయితే, శ్రీ శ్రీ చాలా కవితలు సంస్కృత పద బాహుళ్యం మీద ఎందుకు ఆధారపడి ఉంటై అన్నది ప్రశ్న. ఎందుకంటే, ఆయన వేగవంతమైన ఆవేశపూరితమైన శైలికావాలి. అది సంస్కృత శబ్దాలతో, సమాసాలతో, సాధ్యమౌతుంది. అందుకే అంత సంస్కృతం శ్రీ శ్రీ కి యిష్టమైంది. నడకలోని ఆవేశం కోసం, తీవ్రమైన నడక కోసం, అది ప్రాచీన మా నవీనమా అన్న ప్రశ్న లేకుండా, తన శైలికోసం స్వీకరిస్తాడు శ్రీ శ్రీ…



“దారుణ మారణ దానవభాషలు

ఫేరవ భైరవ భీకర ఘోషలు”

“ఖండ పరుశుగళ కపాలగణముల్”

“వలయ విచల ద్విహంగాలో

విలయ సాగరతరంగాలో

యుద్ధ గుంజన్మృరంగాలో”

“గిరులు సాగరులు

కంకేళీకామంజరులు

ఝురులు నా సొదరులు”



శబ్ద స్వరూపాన్ని కూడా నడకల కోసం మార్చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నై. గిరులు, సాగరాలు, గుంజరులు, ఝరులు అనవలసింది, “సాగరులు” అనేస్తాడు. సగరుని పుత్రులు సాగరులౌతారు. సంస్కృత భాషలో ప్రాసలు, అనుప్రాసలు, శబ్దాలంకార విస్తృతి బాగా ఎక్కువ. అందుకే తన ప్రయోగశీలతకు ఆ భాష ఎక్కువగా ఆకర్షించింది. ఆ భాషలో శబ్ద చమకృతులు ఎన్నైనా చెయ్యవచ్చు. ఆయనే అన్నట్ళు ఒక్కొక్క చోట అర్ధానికి కూడా విడాకులివ్వడం సర్రియలిస్టు లక్షణమే.



“భ్రమరగీత”లో ఇలా అంటాడు.



“గిరగిర గిరాం

భ్రమరం

గిరాం భ్రమరం

భ్రమం

భ్రమరణం

భ్రమరభ్రమణం

భ్రమణ భ్రమరం

గిరగిరగిరా గిరా గిరాం భ్రమణం….!



తుమ్మెద మోతపెడుతూ తిరుగుతున్నట్లే ఉంది ఈ నడక. ఈ వైచిత్రికి తెలుగు భాషలో కుదరదు.

శ్రీ శ్రీది ఆవేశ ప్రకృతి. నడక కోసం అనేక ఔచిత్యాన్ని అధిగమించడం కూడా కనిపిస్తుంది. అయితే, అవి శ్రీ శ్రీ లాంటి తన యుగకర్త చెయ్యడం వల్ల, మంచివిగానే ప్రచవితం కావడం అతని శక్తికి సంబంధించిన అంశం. అసలు “మహా ప్రస్థానం” అనే దానికే “మరణం” అని అర్ధమైనా, సుదీర్ఘ ప్రయాణం, లాంగ్ మార్చ్ అనే అర్ధంలో రూఢమైంది. అలాగే “పతితులార! భ్రష్టులార!” అనే శబ్దాల రూఢ్యర్ధం వేరు. శ్రీ శ్రీ ప్రయోగించిన అర్ధం వేరు. అయిన శ్రీ శ్రీ నుండి అవి అర్ధాలు మార్చుకున్నై. గురజాడ “మాటామంతీ, అవీ ఇవీ” అనే సంకలనంలో ఇలా అన్నాడు.

విషాద రేఖవృతమైన మనః ప్రవృత్తిపై, కరుణ రస శబలితమగు ప్రభావము ఎటులుండును? ప్రాచీన స్మృతులను ఉయ్యాలలూపినట్లు ఊపి మనసును అనునయించి మార్ధవమును కలిగించును. ఈ వాక్యం ప్రభావమే శ్రీ శ్రీ లో



“శిశువు చిత్రనిద్రలో

ప్రాచీన స్మృతులూ చే చప్పుడూ”



అయింది. శిశువుకి ప్రాచీన స్మృతులంటే, పూర్వజన్మ స్మృతులే ఔతుంది. కాని, శ్రీ శ్రీకిశబ్దము , శబ్దం నడక మాత్రమే ముఖ్యం.



“ఖడ్గ మ్నగోదగ్రవిరామం

ఝంఝానిల షడ్జధ్వానం”



అన్నప్పుడు “షడ్జ” స్వరం నెమలి క్రేంకారానికే అన్వయిస్తుంది. కాని ఆపదంలోని బలంవల్ల ఝంఝా మారుతానికి ప్రయోగించి, ఆహా అనిపిస్తాడు శ్రీ శ్రీ. ఆవేశాన్ని చెప్పడానికి అనేక ప్రతీకల్ని అధ్బుతంగా “నవ కవిత” లో రాసిన శ్రీ శ్రీ శైలిలో కలిసిపోయేటట్టుగా”పులిచంపిన లేడీ నెత్తురు” అంటాడు. “పులి చంపిన లేడి” దయనీయమైన దృశ్యమేగాని, ఆవేశ ఔచిత్యం గలదికాదు. అయినా మనం ఆ శైలిలో పడీ కొట్టుకుపోతాం. ఇలాంటివి ఎన్నో ఉంటై శ్రీ శ్రీ లో. “హరోంహరహర” అని దూకడంలో శబ్దపూర్వకమైన ఆవేశం, యింకెలా అన్నారాదు కాబట్టి అలాగే ప్రయోగించాడు. శబ్దాన్ని తాను కోరినట్లు నడిపించి, ఏదో ఒక కోణంలో అంగీకరింపజేస్తేనే, ఇలాటి వాటిని కూడా తనలో కలుపుకోగలడు పాఠకుడు.

పైన చెప్పినదంతా ఒక పార్శ్వం. రెండో పార్శ్వంలో శ్రీ శ్రీ సంస్కృత శబ్ద ప్రయోగం లోని భావధ్వనిని కూడా వివరించవలసి ఉంది. శ్రీ శ్రీ ప్రాచీన సాహిత్యాన్నీ, అలంకార శాస్త్రాన్నీ బాగా చదివిన కవి. అలాగే పాశ్చాత్య కవిత్వంలోని మర్మాలన్నీ అవగతం చేసుకున్న కవి. అందుకే శబ్దానికి, భావాన్ని స్ఫురింపజేసే శక్తిలోని లోతుల్ని కూడా బాగా అవగహన చేసుకుని, తన కవిత్వంలో వాటిని ప్రతిబింబజేసిన సమర్ధుడు.

ఆవేశం, సౌందర్యం, విషాదం, భీభత్సం ఇలా ఎన్ని భావాలనైనా, సంస్కృత పదాలనడక ద్వారా, ప్రాసాను ప్రాసాది సామాగ్రి ద్వారా పలికించే శిల్పపటిమ శ్రీ శ్రీకి విస్తృత ప్రాచీన, పాశ్చాత్య సాహిత్య అధ్యయనం వల్ల వచ్చిందే.

“గంటలు” కవితలో గంట అటూ ఇటూ గంట మోగినట్లున్న లయను గమనించవచ్చు.



“భయంకరముగా, పరిహాసముగా

ఉద్రేకముతో, ఉల్లాసముగా

సక్రోధముగా, జాలిజాలిగా

అనురాగముతో, ఆర్భాటముగా

ఒకమారిచటా, ఒక మారిచటా

గంటలు! గంటలు

గంటలు! గంటలు”



ఆవేశాన్ని పలికించడానికీ, సౌందర్యాన్ని ధ్వనింపజెయ్యడానికీ రెండు ఉదాహరణలు చూడవచ్చు.



“కష్టజీవులకు, కర్మ వీరులకు

నిత్యమంగళం నిర్ధేశిస్తూ

స్వస్తి వాక్యములు సంధానిస్తూ

స్వర్గ వాద్యములు సంధావిస్తూ

వ్యధార్త జీవిత యధార్ధ దృశ్యం

పునాదిగా ఇకజనించబోయే

భావి వేదముల జీవనదములు

జగత్తు కంతా చవులిస్తానోయ్!”



“కవితా! ఓ కవితా! నా యువ కాశలనవపేశల

సుమగీతావరణంలో, అతి సుందర సుస్యందన మందున..”



టి.యస్. ఇలియట్, Allusivness అనే అభివ్యక్తిని ఒక శిల్ప ధోరణిగా ప్రచరితం చేశాడు. ప్రాచీన పురాణ సన్నివేశాన్ని స్ఫురింపజేసే, పదాన్ని ప్రయోగించి, అ వాతావరణాన్ని గుర్తుచేస్తూ, ఆధునిక నేపధ్యానికి అన్వయించడమే ఈ శిల్పం. ఈ కింది ఉదాహరణ దీనికి సంబంధించినదే.



“ప్రపంచమొక పద్మవ్యూహం

కవిత్వమొక తీరని దాహం”



పద్మవ్యూహం – మహాభారతంలోని ప్రసిద్ధమైన యుద్ధ వ్యూహం. అది శత్రువైన దుర్యోధనుని చేత పన్నబడింది. అభిమన్యుడు అందులో ప్రవేశించి, ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నాడు. ఇది గుర్తు రాగానే, వర్తమాన కాలం అంతటి సమస్యామయ మైందనే స్ఫురణ కలుగుతుంది. ఈనాటి కవిత్వం, వర్గశత్రువు పన్నిన సామాజిక వ్యూహాలతో నిండి ఉందనీ, కవిత్వం వాటిని ప్రతి ఫలించాలనీ కవి ఉద్దేశించిన భావ ధ్వని.

కొన్ని చోట్ల సంస్కృత పదాల శక్తిని, పరాకాష్ట దశలో చెదిరి పోయిన భావాల్ని స్ఫురించేటట్లు వాడడం శ్రీశ్రీలో కనిపిస్తుంది. ఇది బీభత్సాన్ని బాగా వ్యక్తం చేస్తుంది.



“హింసన చణ ధ్వంస రచన

ధ్వంసన చణ హింస రచన”



ఇంక ఎన్నో విధాలుగా శ్రీ శ్రీ సంస్కృత భాషని వినియోగించుకున్నాడు. ప్రాచీన నేపధ్యంలోని పదాల్ని తీసుకున్నా, సంప్రదాయ సిద్ధమైన భావాల్ని తీసుకున్నా, వాటికి వర్తమాన స్పర్శ నిచ్చాడు. అతని సంస్కృత పద ప్రయోగంలో నవ్యత ఉంది, ఆధునికతా ధ్వని ఉంది. ఇది శ్రీ శ్రీ నాటికి ఒక వినూత్నఉపలబ్ధి. పదాన్ని ప్రాణంగా చేసుకొని, అర్ధానికి ఆకారమిచ్చిన శ్రీ శ్రీ అభ్యుదయ యుగ ప్రారంభకుడైనాడు.

శ్రీ శ్రీ పరిమళం

2:26 AM Edit This 0 Comments »
ఆవేశం ఆయన సిరా ...


ఆయన కవితలు అక్షర చైతన్యాలు ....

పతితులార భ్రష్టులార , బాధా సర్ప దష్టులార ....అంటూ కవిత్వాన్ని వెన్నెల వాకిళ్ళ లోంచి శ్రామికుడి చెమట చుక్కల్లోకి ఈడ్చుకు వచ్చిన ప్రజాకవి .ఆ మానవీయుని శత జయంతి సందర్భంగా...."సిప్రాలి " నుండి .....



సిరిసిరిమువ్వలు



పాతబడి కుళ్లిపోయిన

నీతులనే పట్టుకుని మనీషుల మంటూ

నూతన జీవిత లహరికి

సేతువు నిర్మింతురేల ?సిరిసిరి మువ్వా !



నీత్యవినీతులలో గల

వ్యత్యాసము తెలిసినట్టి వాడెవ్వడు ?నా

కత్యవసరమొకటే , ఔ

చిత్యం వర్తమునందు, సిరిసిరి మువ్వా !



ప్రాస క్రీడలు



ఈ మంత్రుల హయాం లోన

రామ రాజ్యమెప్పుడు ?

పడమటి దిక్కున సూర్యుడు

పొడుచుకొచ్చినపుడు



ప్రజాస్వామ్య పార్టీల్లో

ప్రజలకు తావెప్పుడు ?

నేటి బీరకాయలోన

నేయి పుట్టినప్పుడు



లిమ ఋక్కులు



నేను

ముసలివాణ్ణి

కాను అసలు వాణ్ణి

పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి

పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి

అందుకున్న ఆకాశపు కొసల వాణ్ణి



ఔను

నిజంగా నేను

ప్రజల కవినేను

ఎంచే తంటేను

వాళ్ళని చదివేను

చదివిందే రాసేను



కదన విహారానికి కత్తి పట్టు

కార్మిక వీరుడవై సుత్తి తిప్పు

ప్రగతి విరోధుల భిత్తి కొట్టు

సామ్య వాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు

సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు



సామ్య వాదం

ఈనాటి వేదం

అందరిలో మారుమోగే నినాదం

అందరికీ అందిస్తుంది మోదం

అది సఫలం సుఫలం శ్రీదం

తెలుగు తల్లి!

10:24 PM Edit This 0 Comments »
అదేంటో తెలుగు, తెలుగు తేజం అనగానే నా మనస్సులో వచ్చిన మొదటి పేరు శ్రీ శ్రీ. ఆయన గారు ఖడ్గసృష్టిలో చెప్పిన పద్యం గుర్తు చెయ్యాలని అనిపించింది. తెలుగు తల్లి విగ్రహం, తెలుగు తల్లి పాట వీటి గురించి జరుగుతున్నా రబస  చూసి చిరాకు వచ్చింది. మనం మనం తెలుగు - బాష ని అభివృద్ధి చెయ్యాలి, తెలుగు వాడి సత్తా సాటాలి అన్తేగాని మన కన్నా తల్లి లాంటి తెలుగు తల్లి గురించి మనం కావాలా వద్దా, ఉండాలా వద్దా అని చేర్చించుకోవడం చాల బాదాకరం. అందుకే ఈ సందర్బంగా మనం శ్రీ శ్రీ గారి ఖడ్గసృష్టి నుంచి తెలుగు తల్లి ని గుర్తు చేసుతున్నాచదివి తరించండి...

అదెవో తెలుగు తల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగు తల్లి
పదవోయి తెలుగువాడా
అదే మీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనవోయ్ తెనుంగు రేడా
అదే నీ అనుంగు నేల
అదిగో సుదూరాన వేల
చనవోయ్ తెలుగు వీరా
స్వర్గాల కాంతి స్వప్నాలు
స్వప్నాల శాంతి స్వర్గాలు
నిన్నే పిలుస్తున్నాయి
నిన్నే వరిస్తున్నాయి
ఆందోళనాల డోల
సందేహాల హిందోళ
ఎందాకా ఊగిసలాట
ఇదే నీ గులాబీ తోట
పదవోయ్ తెలుగు బాట
ఇదిగో తెలుగు కోట
పదవోయ్ నిర్భయంగా
పదవోయ్ దిగ్విజయంగా
పదవోయ్ నిశ్చయంగా

మనం తెలుగ జాతి గర్వ పరిచే విదంగా ప్రవర్తిత్దాం!

జై తెలుగు తల్లి!!!

ఎందరో మహానుభావులు - అందరికి వందనములు!

1:30 AM Edit This 3 Comments »
ఈ కలియుగం (కలియుగం బాష కు కూడా) లో అన్ని కంపుటరికరణ జరుగుతున్నా రొజుల్లో మనం మన తెలుగు మరిచి పోతున్నాం! కాబట్టి మనం వీలైనంత వరకు తెలుగు లో మాట్లాడుదాం - వ్రాద్దాం - చదువుదాం. నాకు తెలుసు ఇంగ్లీష్ ఎటు అవసరం (బ్రతకటానికి) - కాని కానీ మన కన్నా తల్లి లాంటి తెలుగును మరవరాదు. అందుకే ఎందరో మహానుభావులు -అందరికి వందనములు అంటూ మొదలు పెట్టాను! తెలుగు భాష అభివృద్ధి కోసం పాటు పడుతున్న ప్రతి ఒక్కరు మహనుభవులే - అందరికి నా కోటి కోటి వందనములు!  శ్రీకృష్ణదేవరాయలు వారు చెప్పినట్లు

"తెలుగదేల యన్న దేశంబు తెలు, గేను
తెలుగువల్లభుండ తెలుగొ కండ
యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స!"

మీరు అందరు మీ అభిప్రాయాల్ని నా ఈమెయిలు కి పంపి నన్ను ఆశిర్వదించాలని కోరుతున్నాను. biosharma@gmail.com
ఈ బ్లాగ్ నిర్మాణానికి పునాది నా ప్రియ మిత్రుడు చైతన్య (రామ్కో సిస్టమ్స్ ). ఈ ఆలోచన కల్పించిన వ్యక్తి. మీరు కూడా మీకు తోచిన సాహిత్య సహాయం చేయాలనీ కోరుతూ ..

మీ శ్రేయోభిలాషి .....
ప్రయాగ పురుషోత్తం